వైసీపీ-ఎంఐఎం చర్చలు షురూ: ఒవైసీతో వైసీపీ ఎమ్మెల్యే భేటీ

0
383

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ తరపున ప్రచారం చేస్తామని ఎంఐఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని స్ధానాల్లోనూ తాము పోటీకి దిగుతామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ తెలిపారు. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల మైత్రిబంధం బలోపేతం చేసే దిశగా చర్చలు మొదలైనట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కొన్ని పరిణామాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి నిన్న అసదుద్దీన్ ఒవైసీతో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

తమ ఇద్దరికి ఇది వరకే మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని కేవలం మర్యాదపూర్వకంగానే కలిశామని వీరిద్దరూ చెబుతున్నప్పటికీ లోపల వేరే చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వీరిరువురి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది.

తనను ఓడించేందుకు తెలంగాణలో ప్రచారం చేయడంతో పాటు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. ప్రస్తుతం కేసీఆర్‌కు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్‌‌ కూడా ఆయనకు సహకరించేందుకు ఏపీలో వైసీపీకి మద్ధతుగా నిలబడుతుందన్నది బహిరంగ రహస్యం.

నిన్న జరిగిన భేటీలో ఏపీ ఎన్నికల్లో మజ్లిస్,టీఆర్ఎస్ నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరమో జగన్ మనుసులోని విషయాలను గౌతంరెడ్డి ద్వారా అసదుద్దీన్‌కు తెలిపినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో మైనారిటీ ఓట్లను ఆకర్షించడానికి వైసీపీ తరపున ప్రచారం చేయాల్సిందిగా అసదుద్దీన్‌ను మేకపాటి కోరినట్లు లోటస్‌పాండ్ టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here