ముంబయి ఇండియన్స్‌ జట్టుకి వరల్డ్ కప్ షాక్…

0
174

ఈ ఏడాది ఇంగ్లాండ్ లో ప్రపంచ దేశాల మధ్య వన్డే సమరం జరగనుంది. ఈ క్రమంలో అన్ని జట్లు ఇప్పటి నుండే వరల్డ్ కప్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా బిసిసిఐ కూడా టీంఇండియాలో స్టార్ ఆటగాళ్ళను వరల్డ్ కప్ కోసం సంసిద్దం చేసే పనిలో పడింది. ఆటగాళ్లు గాయాల  బారిన పడకుండా చూడటంతో పాటు ఫిట్ నెస్ సాధించేలా చర్యలు తీసుకుంటోంది.

అయితే బిసిసిఐ ఈ లక్ష్యం నెరవేరాలంటే ప్రపంచ కప్ కు ముందు జరిగే ఐపిఎల్ లో ఆటగాళ్లేవరికి గాయాలవకుండా ఉండాలి. కానీ భారత ఆటగాళ్లందరిని ఐపిఎల్ ఆడకుండా చేయడం కుదరదు. ఇలా సందిగ్దంలో పడ్డ బిసిసిఐకి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సలహా ఇచ్చాడు.  ఐపిఎల్ లో ఎక్కువగా బౌలర్లే గాయాలపాలవడం, తీవ్రంగా అలసిపోవడం జరుగుతుంది. కాబట్టి వరల్డ్ కప్‌ జట్టులో సెలక్టయ్యే అవకాశం వున్న భారత బౌలర్లను మాత్రమే ఐపిఎల్ ఆడకుండా చూడాలని సూచించాడు. బిసిసిఐ మేనేజ్ మెంట్ కు కోహ్లీ సలహా నచ్చి దాన్ని పాటించాలని చూస్తున్నారట.

దీంతో ఇప్పటికే భారత్ తరపున వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించే అవకాశం వున్న బౌలర్లను బిసిసిఐ గుర్తించినట్లు  అధికారి తెలిపారు. అందులో ఇటీవల నిలకడగా రాణిస్తూ జట్టులో కీలక బౌలర్ గా ఎదిగిన యువ ఆటగాడు జస్ప్రీత్ సింగ్ బుమ్రా పేరు ముఖ్యమైంది. అందువల్ల అతడికి ఐపిఎల్ నుండి విశ్రాంతి ఇవ్వాలని బిసిసిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బుమ్రా ఐపిఎల్ లో ముంబై ఇండియన్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఆ జట్టులో అతడు ప్రధానమైన బౌలర్ గా కొనసాగుతున్నాడు.అందువల్ల అతన్ని ఆడించకుంటే ముంబై జట్టుకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. అందువల్ల బిసిసిఐ ముంబై జట్టు ముందు ఓ ప్రతిపాదన ఉంచేందుకు సిద్దమయ్యింది. బుమ్రాను కేవలం కీలకమైన మ్యాచుల్లోనే ఆడించి మిగతా మ్యాచుల నుండి విశ్రాంతినివ్వాలని కోరనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here