జగన్ కేసులపై చంద్రబాబు వ్యాఖ్యలు: కొట్టిపారేస్తున్న నిపుణులు

0
381

హైదరాబాద్‌: హైకోర్టు విభజన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ కోర్టులో నడుస్తున్న కేసుల విచారణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్ కోసమే హైకోర్టు విభజన జరిగిందని, ట్రయల్ పూర్తయిన జగన్ కేసులో మళ్లీ మొదటికి వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ కేసుల విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ ప్రారంభమైంది. కానీ, చంద్రబాబు వ్యాఖ్యల్లో ఉన్న నిజమెంత అనేది ఇప్పటికీ స్పష్టంగా బయటకు రాలేదు. జగన్ ఆస్తుల కేసుల విచారణ సిబిఐ కోర్టులో జరుగుతోంది. ట్రయల్ కోర్టులో జరిగే విచారణలు ఆ కోర్టులోనే జరుగుతాయి తప్ప అప్పిలేట్ కోర్టులో జరిగే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు.

ట్రయల్ కోర్టుకు, అపిలేట్ కోర్టుకు మధ్య తేడా తెలియక చంద్రబాబు మాట్లాడుతున్నట్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అపిలేట్ కోర్టులో ప్రత్యేక విచారణ అంటూ జరగదని, సాక్ష్యాల పరిశీలన సరిగా జరిగిందా లేదా అనే విషయాన్ని మాత్రమే పరిశీలిస్తారని చెబుతున్నారు.

సిబిఐ కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత తమకు న్యాయం జరగలేదని భావించిన పార్టీ అపిలేట్ కోర్టుకు వెళ్తుంది. జగన్ కేసులు ఇప్పటి వరకు ఆ స్థాయికి రాలేదు. పైగా నేరం జరిగిన చోట మాత్రమే విచారణ జరుగుతుంది. జగన్ కేసుల్లో నేరాలు హైదరాబాదు కేంద్రంగా జరిగాయనే ఆరోపణ ఉంది. అందువల్ల ఆ కేసుల విచారణ తెలంగాణలోనే జరుగుతుందని అంటున్నారు. కేసుల విచారణ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.

సిబిఐ కోర్టు అనేది సిబిఐ కోర్టుగానే ఉంటుంది కాబట్టి మళ్లీ మొదటికి రావడం అంటూ ఉండదనే వాదన న్యాయ నిపుణులు చేస్తున్నారు. కోర్టుల జ్యురిడిక్షన్ ను అర్థం చేసుకోకపోవడం వల్ల అయోమయం ఏర్పడుతోందని అంటున్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య తీవ్రంగా తప్పు పట్టారు. సుప్రీంకోర్టు, హైకోర్టు కుట్రలు ఏమిటని ప్రశ్నిస్తూ న్యాయవ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలను అవమానిస్తున్న చంద్రబాబుపై సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రాసిక్యూట్ కూడా చేయాలని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here