చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్: నేరుగా కేసీఆర్ రంగంలోకి…

0
405

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు నేరుగా రంగంలోకి దిగుతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రత్యేక హోదా నినాదంతో, జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఎజెండాతో కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతారనే మాట వినిపిస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందనే విషయం ఇప్పుడు రహస్యమేమీ కాదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ను గెలిపించడం, సాధ్యమైనన్ని ఎక్కువ లోకసభ స్థానాలు వైసిపి వచ్చేలా ప్రణాళిక రచించి అమలు చేయడం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి తన వ్యూహాన్ని ఇప్పటికే కేసీఆర్ అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అందులో భాగమేనని చెబుతున్నారు. సంక్రాంతి సంబరాల కోసం తలసాని భీమవరం వెళ్లారని అనుకుంటున్నప్పటికీ అందులో టీఆర్ఎస్ రాజకీయ వ్యూహం ఉందని భావిస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకునే పార్టీ ఎపిలో అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని బీసీలను కూడగట్టే పనిలో భాగంగానే తలసాని యాత్ర సాగిందనే ప్రచారం ఊపందుకుంది.

తాజాగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వైసిపి అధినేత వైఎస్ జగన్ తో భేటీ కావడం కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వ్యూహరచనకేనని భావిస్తున్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఈ భేటీ జరుగుతుందని భావిస్తున్నారు. అయితే, ఎపిలో వైఎస్ జగన్ ఎక్కువ లోకసభ స్థానాలను గెలుచుకుంటే, టీఆర్ఎస్, వైసిపి కలిసి కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చుననే ఆలోచన బహుశా కేసిఆర్ కు ఉండవచ్చు.

ఈ స్థితిలో నేరుగా శాసనసభ ఎన్నికల ప్రచారం కోసమని కాకుండా లోకసభ స్థానాల కోసమంటూ, ప్రత్యేక హోదా కోసమంటూ వైసిపిని గెలిపించాలని కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగే అవకాశాలు లేకపోలేదు. కేసీఆర్ కాకున్నా కేటీఆర్ బృందం ఎపిలో పర్యటించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఎక్కువగా తెర వెనక వ్యూహరచనకు, దాని అమలుకు టీఆర్ఎస్ నేతలు పనిచేవచ్చుననే భావన కూడా వ్యక్తమవుతోంది.

అయితే, కేసీఆర్ మిత్రుడు, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం నేరుగా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ముస్లిం జనాభా గణనీయమైన సంఖ్యలో ఉంది. ముస్లింలు అధికంగా ఉండే చోట్ల తమ పార్టీ అభ్యర్థులను అసదుద్దీన్ పోటీకి దించుతారా, జగన్ ను గెలిపించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేయడానికి ప్రచారానికే అసదుద్ధీన్ పరిమితమవుతారా అనేది వేచి చూడాల్సి ఉంది.

మొత్తం మీద, చంద్రబాబుకు ఎపిలో చెక్ పెట్టేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జగన్, కేసీఆర్ ఒక్కటయ్యారనే చంద్రబాబు ప్రచారం ఇక రహస్యమేమీ కాకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here