హైకోర్టు ఆదేశం: జగన్ మీద దాడి కేసులో కీలక మలుపు

0
99

అమరావతి: వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించి హై కోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం ఎన్ఐఏకు కేసు దర్యాప్తు అప్పగించాలని జగన్ తరపు న్యాయవాది కోటరాజు వెంకటేశ్ శర్మ హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఎన్ఐఏకు అప్పగించకుండా సిట్ దర్యాప్తు చేస్తే కేసు విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని జగన్ తరపు న్యాయవాది వాదించారు. ఫలితంగా సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. జగన్ తరపు వాదనలు విన్న హైకోర్టు ఆయన వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీ భవించింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఎన్ఐఏ కు కేసును అప్పగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై దాడి ఘటనకు సంబంధించి థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని హైకోర్టును ఆశ్రయించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం థర్డ్ పార్టీ విచారణకు డిమాండ్ చేశారు. ఏపీ గవర్నర్ నరసింహన్, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోపాటు పలు కేంద్రమంత్రులను కోరారు.

వైఎస్ జగన్ పై దాడి కేసుకు సంబంధించి తమకు పలు అనుమానాలు ఉన్నాయని వైసీపీ నేతలు మెుదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే సిట్ దర్యాప్తుకు వాంగ్మూలం ఇచ్చేందుకు వైఎస్ జగన్ తొలుత నిరాకరించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.

అయితే జగన్ పై దాడి ఘటనకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై వైసీపీ అనుమానం వ్యక్తం చేసింది. విమానాశ్రయంలో దాడి  జరిగితే షెడ్యూల్ ఎఫెన్స్ కింద కేసు నమోదు చేసి సెక్షన్ 3ఏ చట్టం కింద ఎన్ఐఏకు కేసును దర్యాప్తు చేపట్టాలని అయితే అందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించడంలేదని వైసీపీ నేతలు ఆరోపించారు.

మరోవైపు జగన్ పై దాడికి సంబంధించి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము థర్డ్ పార్టీ విచారణ కోరుతున్నామని అందుకు అనుగుణంగా హైకోర్టు ఎన్ఐఏకు అప్పగించడం సంతోషదాయకమన్నారు.

జగన్ పై దాడి ఘటన కోడికత్తి దాడి కాదు అని అది నారాకత్తి దాడి అనేది ఎన్ఐఏ తేలుతుందని వైసీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై దాడి చేసిన కత్తి చూస్తుంటే అది ప్రత్యేకించి తయారు చేయించిన కత్తిలా ఉందని వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు.

ఇకపోతే గత ఏడాది అక్టోబర్ 25న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ లో వేచి ఉండగా ఫ్యుజన్ ఫుడ్ లో పనిచేస్తున్న వెయిటర్ శ్రీనివాసరావు జగన్ కు టీ ఇస్తూ మాట కలిపారు. సెల్ఫీ దిగుతానని చెప్పి ఒక్కసారిగా కోడికత్తితో జగన్ పై దాడి చేశారు. ఈ దాడిలో జగన్ భుజంపై గాయం అయ్యింది.

జగన్ పై దాడికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 92 మందిని సిట్ బృందం విచారించింది. అయితే ఇటీవలే విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ చంద్ర లడ్హా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పై దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here