ప్రభుత్వాన్ని కూలిస్తే 100 కోట్లు ఇస్తామన్నారు: దిగ్విజయ్ సంచలన ఆరోపణలు

0
91

మధ్యప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు.. బీజేపీ వంద కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘ బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి.. సబల్‌ఘర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ నేత బాజీనాథ్ కుశ్వాహను కలిశారని, అనంతరం ఆయనను ఓ దాబాకు తీసుకెళ్లి.. బీజేపీ సీనియర్ నేతలు, మాజీమంత్రులైన నరోత్తమ్ మిశ్రా, విశ్వాస్ సారంగ్‌ బాజీనాథ్‌తో మాట్లాడారన్నారు..

ఈ సందర్భంగా కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహాయం చేస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ఆయనకు ఆశ చూపారని ఆరోపించారు. అలాగే వారి తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి సైతం ఇస్తామని చెప్పారని దిగ్విజయ్ చెప్పారు.

అయితే బాజీనాథ్ వీటిని తిరస్కరించారని, శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఓటమిని జీర్ణించుకోలేక ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. మరోవైపు దిగ్విజయ్ ఆరోపణలు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు ఖండించారు.

అబద్ధాలు ప్రచారం చేయడం డిగ్గీరాజాకు అలవాటేనని, ఆయనో ‘‘ గాసిప్ మాంగర్’’ అని విమర్శించారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే తప్పకుండా విచారణ జరిపించాలని, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే అన్న విషయాన్ని వారు గుర్తుచేశారు. అవసరమైతే దాబాకు వెళ్లి సీసీటీవీ ఫుటేజ్‌లు తెప్పించి అసత్య ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. బీజేపీకి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

కాగా, ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 స్థానాలను గెలుచుకుని మేజిక్ ఫిగర్‌కు రెండు స్థానాల దూరంలో నిలవడంతో బీఎస్పీ, ఎస్పీ మద్దతుతో 15 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here